Revelation of John 18

చివరి రోజుల్లో ఉండబోయే భ్రష్ఠక్రైస్తవ్యం

1ఆ తరవాత పరలోకం నుండి మరో దూత దిగి రావడం చూశాను. అతనికి గొప్ప అధికారం ఉంది. అతనికున్న యశస్సు చేత భూమి అంతా ప్రకాశించింది.

2అతడు గొప్ప స్వరంతో బిగ్గరగా ఇలా అన్నాడు.

“బబులోను నాశనమైంది! బబులోను నాశనమైంది! అది దయ్యాలకు నివాసమైంది.
ప్రతి అపవిత్రాత్మకూ ఉనికిపట్టు అయింది. అపవిత్రమూ అసహ్యమూ అయిన ప్రతి పక్షికీ గూడు అయింది.
3ఎందుకంటే దైవాగ్రహాన్ని తెచ్చే దాని లైంగిక విశృంఖలతా మద్యాన్ని జనమంతా తాగి మత్తెక్కి పడిపోయారు.
భూమి మీద రాజులు ఆమెతో వ్యభిచారం చేశారు. లోకంలో వ్యాపారులు ఆమె అధిక సుఖభోగాల వల్ల సంపన్నులయ్యారు.”

4తరువాత మరో స్వరం పరలోకం నుండి వినిపించింది. ఆ స్వరం ఇలా చెప్పింది.

“నా ప్రజలారా, మీరు ఆమె పాపాల్లో భాగం పంచుకోకుండా, ఆమెకు సంభవించబోయే కీడుల్లో ఏదీ మీకు సంభవించకుండా ఆమెను విడిచి వచ్చెయ్యండి.
5ఆమె పాపాలు ఆకాశాన్నంటుతున్నాయి.
దేవుడు ఆమె నేరాలన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాడు.
6ఆమె చెల్లించిన ప్రకారం ఆమెకు చెల్లించండి.
ఆమె చేసిన దానికి ఆమెకు రెట్టింపు చేయండి.
ఆమె కలిపిన పాత్రలోనే ఆమె కోసం రెండొంతులు కలపండి.

7ఆమె తనను తాను హెచ్చించుకుంది. విలాస భోగాల్లో జీవించింది.

అంతే మొత్తంలో ఆమెకు హింసనూ, వేదననూ కలగజేయండి.
ఎందుకంటే ఆమె తన మనసులో, “నేను రాణిగా కూర్చుండేదాన్ని, విధవను కాను.
సంతాపం చూడనే చూడను” అనుకుంది.
8కాబట్టి ఆమెకి కీడులన్నీ ఒక్క రోజే కలుగుతాయి. మరణమూ, దుఖమూ, కరువూ వస్తాయి.
దేవుడైన ప్రభువు మహా శక్తిశాలి. ఆమెకు తీర్పు చెప్పేది ఆయనే. ఆమె అగ్నికి ఆహుతైపోతుంది.”

బబులోను పతనం గురించి విలాపం

9
This verse is empty because in this translation its contents have been moved to form part of verse Rev 18:10.
In this translation, this verse contains text which in some other translations appears in verses Rev 18:9-Rev 18:10.
10ఆమెతో అక్రమ లైంగిక సంబంధాలు పెట్టుకుని సుఖభోగాలు అనుభవించిన భూరాజులు అందరూ ఆమెకు కలుగుతున్న వేదన చూసి భయంతో దూరంగా నిలబడతారు. ఆమె తగలబడి పోతుంటే వచ్చే పొగను చూస్తూ రోదిస్తారు.

“అయ్యో, అయ్యో, బబులోను మహానగరమా,
శక్తివంతమైన నగరమా, ఒక్క గంటలోనే నీ మీదికి శిక్ష వచ్చి పడిందా” అంటూ ఏడుస్తారు.

11లోకంలోని వ్యాపారులు కూడా ఆ నగరాన్ని చూసి విలపిస్తారు. ఎందుకంటే, ఇక మీదట తమ వస్తువులు కొనేవారు ఎవ్వరూ ఉండరు. 12వారి సరుకులు ఏవంటే బంగారం, వెండి, రత్నాలు, ముత్యాలు, సన్నని నేత బట్టలు, ఊదారంగు బట్టలు, పట్టు బట్టలు, ఎర్రని బట్టలు, ఇంకా పరిమళాన్నిచ్చే విలువగల ప్రతి రకమైన కలప, దంతం, ఎంతో విలువైన చెక్క, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళూ మొదలైన వాటితో చేసిన ఎన్నో రకాల వస్తువులూ 13దాల్చిన చెక్క, పెద్ద యాలుకలు, ధూపం కోసం వాడే వస్తువులూ, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసం, నూనె, మెత్తని పిండి, గోదుమలు, పశువులు, గొర్రెలు మొదలైనవి. ఇంకా గుర్రాలూ, రథాలూ, బానిసలూ, మనుషుల ప్రాణాలు.

14“నీ మనస్సు ఆశించిన ఫలం నిన్ను విడిచి పోయింది. నీ విలాసం, వైభోగం మాయమై పోయాయి. అవి ఇక కనపడవు” అని చెబుతూ ఏడుస్తారు.

15ఆ నగరంలో ఈ వస్తువులతో వ్యాపారం చేసి సంపన్నులైన వ్యాపారులు ఆమె వేదన చూసి భయంతో దూరంగా నిలిచి ఏడుస్తూ గట్టిగా రోదిస్తారు. 16“సన్నని నేత బట్టలు, ఊదారంగు, ఎర్రని బట్టలు కట్టుకుని బంగారంతో, రత్నాలతో, ముత్యాలతో అలంకరించుకున్న మహా నగరమా, అయ్యో, అయ్యో, ఇంత ఐశ్వర్యమూ ఒక్క గంటలోనే మాయమైపోయిందే!” అంటారు.

17ప్రతి నౌకాధిపతి, సముద్ర యాత్రికులు, ఓడ నావికులు, ఇలా సముద్రం మీద ఆధారపడి బతికే వారంతా దూరంగా నిలబడి

18నగరం తగలబడి పోతుంటే రాజుకున్న పొగను చూసి, “ఈ నగరానికి సమానమైనదేది?” అంటూ కేకలు పెడతారు. 19తమ తలల మీద దుమ్ము చల్లుకుని ఏడుస్తూ రోదిస్తూ, “అయ్యో, అయ్యో, ఆ మహా నగరం. సొంత నౌకలు ఉన్న వారంతా ఈ నగరంలోని సంపద వల్ల ధనవంతులయ్యారు. అలాటిది ఒక్క గంటలోనే ఇలా నాశనమయిందే” అంటారు.

బబులోను పతనం గురించి భక్తుల హర్షం

20“పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, ఆమెను గురించి సంతోషించండి. ఎందుకంటే అది మిమ్మల్ని శిక్షించిన దానికి ప్రతిగా దేవుడు ఆమెను శిక్షించాడు.”

21ఆ తరువాత బలవంతుడైన ఒక దూత పెద్ద తిరగలి రాయి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఇలా అన్నాడు, “ఇలాగే మహా నగరమైన బబులోను కూడా హింసల పాలై కూలిపోతుంది. ఇక అది ఎన్నటికీ కనిపించదు. 22కాబట్టి తీగ వాయిద్యాల శబ్దాలూ, గాయకుల పాటలూ, పిల్లనగ్రోవి, బూరలు ఊదేవారి శబ్దాలూ ఇక ఎన్నటికీ నీ దగ్గర వినిపించవు. ఎలాంటి శిల్పమైనా చెక్కే శిల్పి ఎవరూ నీ దగ్గర ఇక కనపడడు. తిరగలి శబ్దం ఇక ఎప్పటికీ నీ దగ్గర వినపడదు.

23దీపం వెలుతురు నీలో ఇక కనిపించదు. పెళ్ళి కొడుకు స్వరం, పెళ్ళి కూతురు స్వరం ఇక ఎన్నటికీ నీలో వినపడవు. ఎందుకంటే నీ వర్తకులు ప్రపంచంలో గొప్పవారుగా ఉండేవారు. దేశాలన్నీ నీ మాయలో పడి మోసపోయాయి.” ప్రవక్తల రక్తం, హతసాక్షుల రక్తం, ఇంకా భూమిపై వధ అయిన వారి రక్తం ఆమెలో కనిపిస్తూ ఉంది.

24

Copyright information for TelULB